Pages

Tuesday, June 26, 2012

Thursday, April 5, 2012

కే. బాల గోపాల్ నివాళి



హక్కులనేత బాల గోపాల్ ఆకస్మిక మరణం ప్రజాస్వామిక వాదులందరిని నిర్ఘాంత పరిచింది. హక్కుల ఉద్యమ ప్రస్థానంలో ఆయనలేని లోటు ఇప్పట్లో భర్తీ చేయడం కష్టసాధ్యం. వాస్తవానికి హక్కుల ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఒక గుర్తింపును విశ్వసనీయతను తీసుకురావడంలో బాలగోపాల్ చేసిన విశేష కృషి దాగివుంది. హక్కుల ఉద్యమానికి ఒక కొత్త ఒరవడినీ, దృక్పధాన్నీ ఇవ్వడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. సమాజంలో హక్కుల ఉల్లంఘనను విపరీతంగా పట్టించుకునే బాలగోపాల్ తన ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆ అలక్ష్యమే తనని అక్టోబర్ 8 రాత్రి 10 గంటలకు మన నుంచి శాశ్వతంగా దూరం చేసింది.
బాలగోపాల్ కందాళ పార్థనాధ శర్మ, నాగమణి దంపతుల ఐదవ సంతానం. తండ్రి ఉద్యోగరీత్యా మూడు సంవత్సరాలకొకసారి బదిలీ కావటం వల్ల బాలగోపాల్ విద్యాభ్యాసం రాష్ట్రంలో పలుచోట్ల సాగించి. కావలిలో P.U.C ., తిరుపతి, S.V. ఆర్ట్స్ కాలేజీలో B.Sc. చదివాడు. వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలొ గణితశాస్త్రం లో M.Sc., డాక్టరేట్ చేసి 1980 లో ఢీల్లీ లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో పోస్ట్ డాక్టరల్ ఫెలోగా చేరాడు. అక్కడి జీవితంలో అసంతృప్తి చెందిన ఆయన ప్రజాఉద్యమాలకు దగ్గరగా వుండాలనే ఉద్దేశ్యంతో తిరిగి వరంగల్ వచ్చి, కాకతీయ యునివర్శిటీలో లెక్చరర్ గా చేరాడు. అనాటి ప్రజాఉద్యమాల స్పూర్తితో బాలగోపాల్ హక్కుల ఉద్యమాన్ని తన కార్యక్షేత్రంగా ఎంచుకుని, ఆంధ్ర ప్రదేశ్ పౌరహక్కుల సంఘం (APCLC) లో చేరి క్రీయాశీలకంగా పనిచేయడం ప్రారంభించాడు. అనతికాలంలోనే అనగా 1983లోనే APCLC ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, 15 సంవత్సరాల పాటు సంస్థకు నాయకత్వం వహించి, పౌరహక్కుల సంఘాన్ని విస్తృత పరచడంలో ఎనలేని కృషి చేశాడు.
బాలగోపాల్ది విశిష్టమైన వ్యక్తిత్వం. ఒక మేధావి, రచయిత, నేత, సాధారణ కార్యకర్త ఒకే వ్యక్తిలో మేళవించి వుండడమే ఆయన ప్రత్యేకత. సంస్థకు బాధ్యతాయుత స్థానంలో ఉన్నా సాధారణ కార్యకర్తలాగా గోడకు పోస్టర్లు అంటించడం, కరపత్రాలు పంచడం సంస్థ ప్రచురణలను అమ్మడం చేయగలడు. వ్యక్తే సంస్థగా, సంస్థలో ఒక వ్యక్తిగా గొంతులేని వారి తరుపున గొంతెత్తాడు.
ఎటువంటి నిర్భంధానైనా తట్టుకుని నిలబడగలగడం పౌరహక్కుల కార్యకర్తలకు వుండాల్సిన ముఖ్య లక్షణం. ఈ విషయంలో బాలగోపాల్ నుండి నేర్చుకోవాల్సింది ఎంతైనా వుంది. పౌరహక్కుల సంఘంపై ప్రభుత్వ నిర్భంధం తీవ్ర రూపం దాల్చి గోపిరాజన్న, జాపాలక్ష్మారెడ్ది, డా.రామనాధం, నర్రా ప్రభాకర్ రెడ్డి, ఇంకా ఎందరో రాజ్యహింసకు బలైపోయినా, తనను పోలీసులు కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టినా ఏ మాత్రం బెదరకుండా సంస్థను ముందుకు నడిపించడంలో బాలగోపాల్ అసమాన ధైర్యసాహసాల్నీ చొరవనూ ప్రదర్శించాడు. సమాజంలో ప్రతి సమస్యకు హక్కులకోణం వుంటుందని చాటి చెప్పి, హక్కుల దృక్పధాన్ని విస్తృత పరిచాడు. “సమాజంలో ప్రతి మనిషి శాసించి, అతని ఎదుగుదలకు ప్రతిబంధకంగా ఉన్న శక్తులను ప్రశ్నించడానికి హక్కులు అవసరం. సమాజంలో అసమానతలను, ఆధిపత్యాన్ని పీడనలను ప్రశ్నించడానికి హక్కులు ఒక సాధనం.” అని బాలగోపాల్ హక్కుల అర్థాన్ని, అవసరాన్ని తెలియజెప్పాడు. నిత్యం సమాజంలో సామాన్య ప్రజల హక్కులు ఏఏ రూపాల్లో ఉల్లంఘనకు గురవుతున్నయో పరిశీలించి, అందుకు దారితీసిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల్నీ కారణాలనూ అవగాహన చేసుకుని, ప్రభుత్వ విధానాల మంచి చెడ్డలను చర్చించి ఎన్నో సమస్యలపై బాలగోపాల్ నివేదికలను రూపొందించాడు. నిజనిర్థారణ అంటే కేవలం వాస్తవాలను సేకరించి పత్రికా ప్రకటనలు ఇవ్వడం కాదు. నిజనిర్థారణ ద్వారా చేసిన అధ్యయనం, రిపోర్టులు ప్రజలను చైతన్య పరచడానికి, ఆ చైతన్యంలో ప్రజలు స్వతంత్రంగా తమ హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని ఇవ్వడం జరగాలని బాలగోపాల్ చెప్పేవాడు.
పౌరహక్కుల ఉద్యమ పరిధినీ అవగాహననూ విస్తృత పరచడంలో బాలగోపాల్ ప్రధాన భూమికను పోషించాడు. కేవలం రాజ్యహింసను వ్యతిరేకించడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడిన APCLC, తన పరిధినీ, కార్యరంగాన్నీ విస్తరించుకుని, సమాజంలో జరుగుతున్న వివిధ ఆధిపత్య వ్యవస్థల మూలంగా జరుగుతున్న హక్కుల ఉల్లంఘనను కూడా పట్టించుకుని పనిచేయడంలో బాలగోపాల్ చేసిన కృషి దాగివుంది. ఫలితంగానే పౌరహక్కుల సంఘం దళితులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా, స్త్రీలపై జరిగే అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా, పర్యావరణ సమస్యలకు వ్యతిరేకంగా, ఫ్యాక్షన్ భూతం వల్ల సాధారణ ప్రజలు జీవించే హక్కుకు ఏర్పడిన ముప్పు గురించీ పని చేయడం ప్రారంభించింది. కరువు సమస్యలో హక్కుల కోణాన్ని తీసుకురావడం, ప్రభుత్వ నిర్లక్ష్యం ద్వారానే కరువు సమస్య వుందని, తద్వారా జీవించే హక్కుకు ప్రమాదం వాటిల్లుతుందని వ్యాఖ్యానించాడు. బాల గోపాల్ రాష్ట్రంలోని హక్కుల ఉల్లంఘన సమస్యలపైనే కాకుండా, దేశ వ్యాప్తంగా జరిగిన హక్కుల ఉల్లంఘనలపై స్పందించి పని చేశాడు. కాశ్మీరీ ప్రజల స్వతంత్ర పోరాటాన్ని, ఈశాన్య రాష్ట్రాల ప్రజల జాతీయ పోరాటాన్ని ప్రజాస్వామిక ఆకాంక్షలుగా గుర్తించి, వాటితో సంఘీభావాన్ని తెలపటంతో పాటు, వారిపై రాజ్యం ప్రయోగించిన అణచివేతను ప్రశ్నించాడు. కర్నాటక, ఒరిస్సా, గుజరాత్ రాష్ట్రాల్లో ముస్లిం మైనాటీలపై హిందూమతోన్మాదుల దాడుల్ని తీవ్రంగా ఎండగట్టాడు.
అయితే తొలినాళ్ళలో ఉద్యమ హింసపై బాలగోపాల్ అభిప్రాయంలో క్రమంగా మార్పు చోటుచేసుకున్నది. సాయుధ పోరాటాన్ని తమ పంధాగా ఎన్నుకున్నవిప్లవ పార్టీల చర్యలు కూడా హక్కుల సమీక్షాపరిధిలోకి వస్తాయనే అభిప్రాయానికి బాలగోపాల్ వచ్చాడు. అంతేకాక రాజకీయ ఖైదీల బేషరతు విడుదలకు సంబంధించి, సామ్రాజ్యవాద అంగాలైన స్వచ్చంద సంస్థలపై అవగాహన విషయంలో సంస్థ అభిప్రాయాలతో విభేదించి 1998 లో సంస్థ నుండి బయటకు వెళ్ళి ‘మానవహక్కుల వేదిక’ను ఏర్పాటు చేశాడు.
హక్కుల ఉల్లంఘనల్ని అర్థం చేసుకోవడంలో, అన్వయించడంలో బాల గోపాల్ గారితో తీవ్రమైన అభిప్రాయబేధాలున్నాయి. హక్కుల కార్యాచరణలో చివరి దశకంలో తను ఎంచుకున్న పంధా అంతిమంగా ప్రజా ఉద్యమాలకు ఎంతో కొంత కీడు చేస్తుందనే భావన నాతో సహా వేలాది ఉద్యమాభిమానుల్లో వుంది. సార్వజనీన హక్కుల దృక్పధం దోపిడీ, పీడనలున్న వర్గ సమాజంలో అంతిమంగా ఉన్నవాడికే, ఉపయోగించుకోగలిగిన వాళ్ళకే మేలు చేస్తుందనే చారిత్రక సత్యాన్ని అంగీకరించడంలో బాలగోపాల్ సిద్ధపడలేదని, ఇటీవల తన కార్యాచరణ బట్టి అర్థం అవుతుంది. స్వచ్చంద సంస్థల పట్ల, వాటితో ఐక్యకార్యాచరణ పట్ల తన వైఖరిపై చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రాజ్యహింసను ఖండించడంలో మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. చివరగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా “ఆపరేషన్ గ్రీన్ హంట్” పేరుతో చేపట్టిన మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం అమాయక గిరిజనుల మరణానికి దారి తీస్తుందనే ఆందోళనతో “ఆ వేటను ఆపమని నినదిద్దాం!” అనే పిలుపునిచ్చాడు.
అయితే బాలగోపాల్ గారిలోకొన్ని అసాధారణ లక్షణాలున్నాయి. తన విశ్వాసాలకనుగుణంగా, నిబద్దతతో తనపని తాను చేసుకుపోవడం, అవగాహనకూ ఆచరణకూ ఏ మాత్రం తేడాలేకుండా పని చేయడం హక్కుల ఉద్యమంలో అరుదుగా కనిపించే లక్షణం బాలగోపాల్ ను మరింత ఉన్నతుణ్ణి చేసింది. తన పట్టుదలా కార్యాచరణా ప్రతి కార్యకర్తకు మార్గదర్శకం. తను సమయాన్ని ఏ మాత్రం వృధా చేసే వాడు కాడు. దీనికి ఒక్క ఉదాహరణ చాలు, తనెంత నిబద్ధత కలవాడో అనడానికి. ఒకసారి చిత్తూరుజిల్లాలోని శ్రీకాళహస్తి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణ కోసం వచ్చాడు. ఆ మరుసటి దినం బెంగుళూరులో ఒక మీటింగు కోసం వెళ్ళాల్సి వుంది. ఆ రోజు అన్ని కార్యక్రమాలని ముగించుకొని, రాత్రి 10.30 గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి బస్ స్టాండ్ కు చేరుకున్నాము. బస్టాండులోని లైట్ వెలుతురులో తను రిపోర్టు రాసుకుంటున్నాడు. ఈ లోగా కరెంట్ పోయింది. బాలగోపాల్ తో వున్న నేనూ మరికొందరూ పిచ్చాపాటిగా పచార్లు చేస్తూ, ఈయన కోసం చూస్తే లేడు. తీరా బస్టాండులోని ఒక బంక్ దగ్గర కొవ్వొత్తి వెలుతురుంటే అక్కడికెళ్ళి ఆ వెలుతురులో తను రిపోర్టు రాసుకుంటూ కనిపించాడు. ఆ దృశ్యం నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది. అలాంటి కార్యాచరణ కలిగివుండడం చాలా అసాధారణ విషయం. అది బాల గోపాల్ కే సాధ్యం. అయితే బాలగోపాల్ ఆచరణలో కొన్ని లోపాలు ఉన్నాయి. సంస్థ నిర్మాణం లోపల విమర్శను ఏ మాత్రం స్వీకరించేవాడుకాదు. ఏక పక్ష నిర్ణయాలతో ముందుకు పొయేవాడు. ఒక్కోసారి నిర్మాణ సూత్రాలకు విరుద్దంగా, తనకు తోచిన విధంగా పని చేసుకుంటూ పోయేవాడు. దాని వల్ల సంస్థలో కొంత వ్యక్తి వాదం ఆధిపత్యం చెలాయించిన మాట వాస్తవం.
చివరగా ఒక్కమాట వ్యక్తులు ఎంతటివారైనా, వారి రాజకీయ విశ్వాసాలు, ప్రజల పక్షపాతం చరిత్రలో వారి స్థానాన్ని నిర్ణయిస్తాయి. హక్కుల ఉద్యమానికి బాల గోపాల్ లేని లోటూ వాస్తవమే . కానీ ఏ ఉద్యమమైనా సంఘటితమే కదా! నాయకత్వాల క్రియాశీలతా సాధారణ కార్యకర్తల కృషీ సహకారం లేకుండా ఏ ఉద్యమం ముందుకు పోదు. పౌరహక్కుల ఉద్యమంలో అనేక మంది తమ ప్రాణాలు త్యాగం చేసారు. ఉద్యమాలు నిర్మాణయుతంగా, సంఘటితంగా ఉన్నప్పుడు మరింత బలంగా ఎదుగుతాయి. ప్రస్తుతం హక్కుల ఉద్యమం అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నది. హక్కుల నేతలు తీవ్ర నిర్భందాన్ని ఎదుర్కోంటున్నారు. ప్రభుత్వ విధానాల మూలంగా ప్రజల హక్కులు నిరాకరణకు గురవుతున్నాయి. ఈ నేపధ్యంలో హక్కుల పరిరక్షణకు సంఘటితంగా ఉద్యమించడం అవసరం. బాలగోపాల్ లోని నిజాయితీని, నిబద్దతను మనలో అంతర్లీనం చేసుకుని హక్కుల పరిరక్షణకు నడుం బిగించడమే హక్కుల కార్యకర్తలు ఆయనకు ఇవ్వగల నిజమైన నివాళి.

Thursday, December 22, 2011

నేను తెలుసుకున్న నిజం

ఉన్నది ఒకటే జీవితం
జీవించు ప్రతిక్షణం
ఏది కాదు శాశ్వతం
ఇదే నేను తెలుసుకున్న నిజం

Saturday, November 26, 2011

Jeevitham

నమ్మకం మడతల కింద నల్లిలా
వెన్నుముకలేని గుడ్డులా
రద్దీకాగితంలో పలచబడిన సిరాలా
జీవిస్తోన్న జీవితంతో పొత్తుకుదరక